లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

– 36వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌
ముంబాయి, జులై10(జ‌నం సాక్షి ) : దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ఈ వారంలో వెలువడేబోయే కార్పొరేట్‌ కంపెనీల తైమ్రాసిక ఫలితాలు, రూపాయి బలోపేతం అవడం సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ మళ్లీ 36వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ కూడా 10,900 పైన ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాల నడుమ మంగళవారం ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలుపెట్టిన సెన్సెక్స్‌ కాసేపటికే 200 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు అదే స్థాయిలో కొనసాగింది. అయితే చివరి గంటల్లో వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో సూచీ ఒక్కసారిగా జోరందుకుంది. భారీ లాభాల దిశగా సాగింది. అలా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 305 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌ 36,240 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 10,947 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.79గా ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌, హిందాల్కో, రిలయన్స్‌, కోల్‌ఇండియా, యస్‌బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ్గ/నాన్స్‌ లిమిటెడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయాయి.
—————————————–