లేదు లేదంటూనే కారెక్కనున్న దానం
హైదరాబాద్,డిసెంబర్4(జనంసాక్షి): పార్టీని వీడేది లేదు..కాంగ్రెస్ పెద్దలతో విభేదాలు లేవంటూనే మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. సిఎం కెసిఆర్‌తో గతంలో కేవలం అభివృధ్ది కోసం కలిశానని అన్న దానం అది పార్టీలో చేరడానికే అన్న సంకేతాలు ఇచ్చేలా చేస్తున్నారు. శుక్రవారం ఉదయం దానం నాగేందర్ తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దానం నాగేందర్ టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశముందని ఊహాగానాలు వినవస్తున్న తరుణంలో ఇలాంటి చర్చచేపట్టడం విశేషం. ఇక ఊగిసలాటకు, వివరణలకు తావు లేకుండా ఆయన నేరుగా టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు సోమవారం ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో దానం నాగేందర్ డబుల్ గేమ్ నుంచి బయటపడ్డారు. ఆయన టిఆర్‌ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా కూడా ఉన్న నాగేందర్ టిఆర్‌ఎస్ లో చేరడం ఖరారైందని, సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. టిఆర్‌ఎస్ లో ఇప్పటికే చేరి ముఖ్య సలహాదారుగా ఉన్న డి.శ్రీనివాస్ తో సంప్రదింపులు జరిపిన విూదట ఇంకా ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుదని భావించిన దానం నాగేందర్ సోమవారం నాడు టిఆర్‌ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గురువారం నాడు తాను కాంగ్రెస్ ను ఎన్నటికి వీడనని ప్రకటించిన నాగేందర్ ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. గతంలో కూడా రాత్రికి రాత్రి టిడిపిలో చేరి ఎన్నికలలో పోటీచేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు. మేయర్ పదవిని నాగేందర్ ఆశిస్తున్నా, టిఆర్‌ఎస్ అందుకు ఒప్పుకోలేదని అంటున్నారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వవచ్చని అంటున్నారు. అయితే అధికార పార్టీలో చేరడం ద్వారా అధికారానికి చేరువగా ఉండాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ ప్రభాకర్చేరడం వెనకా డిఎస్ హస్తం ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో దానం చేరిక వల్ల టిఆర్‌ఎస్‌కు లబ్ది చేకూరగలదని భావిస్తున్నారు.