లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం

4

– 8.5లక్షల కేసులు పరిష్కారం

– 17 లక్షల మందికి న్యాయం

– నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనంసాక్షి):

లోక్‌ అదాలత్‌ ద్వారా సామాన్యులకు సత్వర న్యాయం అందుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యాయసేవా దినోత్సవం సందర్భంగా సోమవారం దిల్లీలో నిర్వహించిన న్యాయసేవా సదస్సుకు ఆయన హాజరయ్యారు.  న్యాయసేవల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. లోక్‌ అదాలత్ల ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతోందనీ, ఇవి అందిచే న్యాయసేవలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా మాట్లడుతూ… కోర్టులకు రాలేని వారికి లోక్‌అదాలత్‌లు బాగా ఉపయోగపడతాయన్నారు. ఇది ఓ రకంగా ప్రజల ముంగిటకు న్యాయాన్ని తీసుకుని రావడమేనన్నారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా 8.50లక్షల కేసులు పరిష్కార మయ్యాయని… దీనివల్ల 17లక్షల మందికి న్యాయం చేకూరిందన్నారు. ప్రజలందరికీ అభివృద్ధితో పాటు న్యాయసేవలు కూడా అందించాలన్నారు. లోక్‌ అదాలత్‌లపై పరిశోధన చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని ప్రోత్సహిస్తే కోర్టులపై భారం తగ్గుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లతో సరైన న్యాయం జరుగుతుందన్న విశ్వాసం తనకుందని మోదీ స్పష్టం చేశారు.  ప్రజలంతా లోక్‌ అదాలత్‌ల వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.  ప్రజలందరికీ అభివృద్ధితో పాటు న్యాయసేవలు కూడా అందాల్సిన అవసరముందని తెలిపిన ప్రధాని న్యాయ విశ్వవిద్యాలయాలయాలు లోక్‌ అదాలత్లకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టులను తమ విద్యార్ధులకు ఇవ్వాలని సూచించారు.