లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం
కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం
మహబూబ్‌నగర్,మార్చి4(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో 45 రోజుల పాటు ఎన్నికల కమిషన్ చేతిలోకి సర్వాధికారాలు వెళ్తాయి. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్ శాఖలపై సీఈసీ గుత్తాధిపత్యం ఉంటుంది. సీఈసీ అనుమతి లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా శాంతి భద్రతల విధులు నిర్వర్తించడంలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్
అమల్లోకి వస్తే పార్టీల ప్రచారాలు ¬రెత్తుతాయి. ఈ సమయంలో అనవసర ఎస్కార్ట్‌లు చేపట్టడం కుదరదు. ప్రస్తుతం ఉభయ జిల్లాలో కలిపి 3500 మంది సివిల్, ఏఆర్ సిబ్బంది పని చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల సమస్యాత్మక ఘటనలు జరిగిన దాఖలాలున్నాయి. పార్టీల నాయకులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఈ తరహా ఘటనలకు ఈసారి అవకాశం లేకుండా ముందస్తు వ్యూహం చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ ఈవీఎంల తనిఖీలను చేపట్టగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి నాలుగు జిల్లాల కలెక్టర్‌లు పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరు, ఎన్నికల్లో వ్యవహరించా ల్సిన పద్ధతులపై సీఈసీ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికలు ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన అధికారులు, పోలీసులు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జాబితాతో పాటు డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుంటారు. శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తు సమాచారం కోసం పోలీసు శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది పని చేస్తున్నారు. ఈ విభాగాన్ని ఎన్నికల సమయంలో పూర్తిగా వాడుకుంటారు. ఇందుకోసం విభాగాన్ని కింది నుంచి బలోపేతం చేసేలా చాకచక్యంగా వ్యవహరించేవారు, క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం రాబట్టే వారిని నియమించుకుని ముందుచూపుతో వ్యవహరించ నుంది.