భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను

దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.శనివారం దిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలు ఓపిక పట్టాలని యువతను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామన్నారు.’’నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్‌ గద్దె దిగాలి. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారు. జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. గ్రూప్‌`1, గ్రూప్‌`2 పరీక్షల రద్దుతో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన పరిణామాలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా పేర్కొంది. చనిపోయిన విద్యార్థినిపై అబాండాలు వేయడం సరికాదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్‌ గద్దె దిగడమే. తెలంగాణలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన వివరాలు ఆదివారం మధ్యాహ్నం చెబుతాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.