వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

 

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28:

వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు కోవాల్సి ఉన్నా ఆ దిశలో చర్యలు మాత్రం కానరావడం లేదు. జిల్లాలో పలుచోట్ల గుత్తేదారులు మొదట్లో పనులు ప్రారంభించినట్లే ప్రారంభించి వదిలేశారు. వర్షాకాలానికి రెండు నెలల ముందే ఇవి పూర్తవుతాయన్న నభరోసా లేకపోవడంతో తాజాగా ఇబ్బందులు పడాల్‌ఇస వస్తోంది. మారుమూల గ్రావిూణప్రాంత ప్రజలకు రవాణా సదుపాయం మెరుగు పరచడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆగమేఘాల విూద గుత్తేదారులు పనులు దక్కించు కున్నారేకాని పూర్తి చేయడంలో మాత్రం శ్రద్ద చూపకపోవడంతో ప్రజల పాలిటశాపంగా మారింది. వాగులపై వంతెనల నిర్మాణానికి వేసవికాలం అనువైనా గుత్తేదారులు నిర్లక్ష్యం వహించారు. కొన్నిచోట్ల పనులు దక్కించుకున్న గుత్తేదారులు అసంపూర్తిగా వదిలేశారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు జైనూర్‌ వాగు గుండా వరద ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుంది. దీంతో వాహన రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రోజుల తరబడి వర్షం వస్తే వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడాల్సి ఉంటుంది. ఇక్కడ హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు దక్కిచుకున్న గుత్తేదారు మాత్రం నిర్మాణ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేసారు. మొదట్లో హడావుడిచేసి జనవరి నెలలో పిల్లర్ల నిర్మాణానికి బ్లాస్టింగ్‌ పనులు మొదలుపెట్టిన గుత్తేదారు ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. ఇలా జిల్లాలో అనేక వంతెనలు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో ఈ వర్షాకాలంలోనూ అవస్తలు తప్పడం లేదు.