వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పు కనివిప్పు కావాలి

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి

మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని పిసిసి అధికార ప్రతినిధి పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. మోడీ, కెసిఆర్‌ మాటలు ఇక నమ్మేస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రజల్లో వీరిపట్ల భ్రమలు తొలిగాయని బుదావరం నాడిక్కడ అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో నాలుగేళ్లపాటు అష్టకష్టాలు పడ్డ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఇసుక కాంట్రాక్టర్ల పేరిట అధికార పార్టీ నాయకులు భూగర్భ జలాలనుఅడుగంటిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికి ఉద్యోగం దొరకలేదని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుటుంబ పాలనగా మారిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఏ వ్యవస్థలు సక్రమంగా పనిచేయట్లేదని అన్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారు. అయినా వారి సభ్యత్వాలను పునరుద్దరించకుండా పోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. రాజ్యంగబద్ధంగా ఎన్నికైనా ఎలాంటి నియమాలు పాటించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సంపత్‌కుమార్‌ల బహిష్కరణ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు అధికారంలో ఉన్న వారికి చెంపపెట్టు అన్నారు. ఈ విషయంలో తొందపపాటు నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సహజన్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసు కుని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్నారు. వెంటనే తప్పును సరిదిద్దుకుని పోతే మంచచిదని శశిధర్‌ రెడ్డి సూచించారు.