వచ్చే ఎన్నికల్లో తమది ఒంటరి పోరే

షా ములాఖత్‌ తరవాత కూడా మారని శివసేన

ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): శివసేన మరోమారు సంచలన ప్రకటన చేసింది. దానిని మచ్చికచేసుకునేందుకు అమిత్‌షా కలిసి వెల్లిన తరవాత కూడా తమ రాజకీయ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరేనని వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన మరోసారి స్పష్టంచేసింది. కేంద్రంలో అధికారం చేపట్టిన నాలుగేళ్ల అనంతరం తొలిసారి భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమైన నేపథ్యంలో ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ఈ విషయం స్పష్టంచేశారు. వచ్చే అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే తీర్మానానికే తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. అమిత్‌ షా, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీపై ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఇద్దరి మధ్యా రెండు గంటలపాటు చర్చలు సాఫీగా సాగాయి. అనేక విషయాలపై వారిద్దరూ చర్చించారు. అమిత్‌ షా ఎజెండా ఏమిటో విూడియాకు తెలుసు. శివసేన ఓ తీర్మానం చేసుకుంది. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని. మా పార్టీ తీర్మానంలో ఎలాంటి మార్పూ ఉండదని వివరించారు.