వచ్చే ఏడాది నవంబర్‌లో యాషెస్ సమరం
మెల్‌బోర్న్ ,నవంబర్ 22 : ప్రపంచ క్రికెట్‌లో మంచి క్రేజ్ ఉన్న యాషెస్ సమరం వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇంగ్లాండ్ , ఆస్టేల్రియాల మధ్య అత్యుత్తమ సిరీస్‌గా భావించే ఈ యాషెస్ కారణంగా వన్డేల సంఖ్య తగ్గించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం 2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ , ఆస్టేల్రియా జట్లు ఐదు టెస్టులు , ఐదు వన్డేలతో పాటు మూడు టీ ట్వంటీలు ఆడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ నవంబర్ 21 నుండి 25 వరకూ గబ్బాలో జరగనుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 5 నుండి 9 వరకూ అడిలైడ్‌లోనూ.. , మూడో టెస్ట్ డిసెంబర్ 13నుండి 17 వరకూ పెర్త్‌లోనూ , నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుండి 30 వరకూ మెల్‌బోర్న్‌లో జరగనున్నాయి. ఇక జనవరి 3 నుండి 7 వరకూ జరిగే చివరి టెస్టుకు సిడ్నీ వేదికగా నిలుస్తోంది. అయితే టెస్ట్ సిరీస్ తర్వాత జరిగే వన్డేలు , టీ ట్వంటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను కొత్త ఏడాదిలో ఖరారు చేస్తామని క్రికెట్ ఆస్టేల్రియా తెలిపింది. ఈ సారి అభిమానులకు వీలుగా ఉండేందుకు షెడ్యూల్‌ను చాలా పకడ్బందీగా రూపొందించినట్టు సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దీంతో అభిమానులు యాషెస్ సిరీస్‌ను ఆద్యంతం ఎటువంటి ఇబ్బందీ లేకుండా వీక్షించే అవకాశముందని తెలిపారు. కాగా యాషెస్ సిరీస్ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
యాషెస్ సిరీస్ 2013-14 షెడ్యూల్ ః
తొలి టెస్ట్ – నవంబర్ 21 నుండి 25 – గబ్బా
రెండో టెస్ట్ – డిసెంబర్ 5 నుండి 9 – అడిలైడ్
మూడో టెస్ట్ – డిసెంబర్ 13నుండి 17 – పెర్త్
నాలుగో టెస్ట్ – డిసెంబర్ 26 నుండి 30 – మెల్‌బోర్న్
ఐదో టెస్ట్ – జనవరి 3 నుండి 7 – సిడ్నీ