వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలంటున్నారు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడంతో శరీరానికి గాలి తగిలి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండొచ్చని అంటున్నారు. వేడికి చర్మం కందిపోయి చర్మవ్యాధులు వస్తాయని.. నాణ్యమైన బాడీ లోషన్స్‌ వాడాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కళ్లకు తగలకుండా చలువ అద్దాలు ధరించడం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని జాగ్రత్తలు చెబుతున్నారు. మధ్యాహ్న
సమయంలో వేడి పదార్థాల జోలికి వెళ్లికుండా ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటే శరీరం సమతుల్య స్థితిని కలిగి ఉంటుందని వైద్యులు అంటున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో పంట పొలాలకు వెళ్లే కూలీలు ఉదయం ఏడు గంటలకే వెళ్లి 12గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నారు. ఉపాధి హావిూ కూలీలు సైతం ఉదయం 11 గంటలకే పనులను ముగించుకుని ఇంటికి చేరుకుంటున్నారు. సెగలు కక్కుతున్న భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 9 గం టల నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే గానీ వేడి తగ్గుముఖం పట్టడం లేదు. అత్ధికంగా జిల్లాలో  42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. ఉదయం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం కష్టంగా మారుతోంది. ఏవైనా అత్యవసర పనులు ఉంటే తప్ప వారు బయటకు రావడం లేదు. దీంతో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం నా లుగు గంటల వరకు పట్టణ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చినా ముఖానికి రుమాలు, తలకు టోపి ధరించి బయటకు వస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా శీతల
పానియాలు తాగుతున్నారు. పండ్ల రసాలు, కొబ్బరి బొండాల రసం తీసుకొని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. దీంతో ఈ దుకాణాలకు గిరాకీ పెరిగింది.  మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఉన్నా ఉక్కపోతను భరించలేక ఫ్యాన్లను, కూలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.