వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ

ద్రవ్యపరపతి విధానంలో కీలక నిర్ణయం
పెరగనున్న వడ్డీ రేట్లు
న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం సాక్షి):  భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. పరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రెపో రేట్‌ 25 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. దీంతో రెపో రేట్‌ 6 నుంచి 6.25 శాతానికి చేరింది. అలాగే రివర్స్‌ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది.  2014 జనవరి తర్వాత ఆర్‌బిఐ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఆర్‌బిఐ నిర్ణయంతో గృహ, వాహనాల లోన్‌లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో గతంలో 6 శాతంగా ఉన్న రెపోరేటు.. ఇపుడు 6.25 శాతానికి చేరింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు. అదే సమయంలో రివర్స్‌ రెపో రేటును కూడా 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రివర్స్‌ రెపో రేటు 6 శాతానికి చేరింది. రెండు నెలలకోసారి నిర్వహించే ద్రవ్యపరపతి విధాన సవిూక్షలో భాగంగా మూడు రోజుల పాటు సమావేశం నిర్వహించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు సామాన్యులకు ఇచ్చే లోన్లపై వడ్డీ భారం పెరగనుంది. ఆరుగురు సభ్యుల ఈ కమిటీకి ఆర్బీఐ చైర్మన్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. నిపుణుల అభిప్రాయానికి విరుద్ధంగా ఈసారి వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచింది. గతేడాది ఆగస్ట్‌ నుంచి వరుసగా ఐదు సమావేశాల్లో వడ్డీరేట్లను ఆర్బీఐ మార్చలేదు. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 4.8 నుంచి 4.9 శాతంగా, రెండో అర్ధభాగంలో 4.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇక జీడీపీ తొలి అర్ధభాగంలో 7.5 శాతం నుంచి 7.6 శాతంగా, రెండో అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.