వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
రైతు సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 27: వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేర్యాల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ జోగినిపల్లి రాజేశ్వరరావుకు వినతిపత్రం పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. రైతులు వరి చేను కోసి వడ్లను ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పది రోజులు గడుస్తున్నా నేటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు పాడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, విద్యుత్, బార్ధాన్, జల్లెడ పట్టె మిషన్లు, లారీల వంటి కొరత లేకుండా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, సిద్దిరాం భద్రయ్య, యేషబోయిన కవిత, మహాదేవులు, ఎల్లయ్య, లచ్చవ్వ, రజిత, మల్లేశం, సురేందర్, కనకయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.