వరంగల్‌ ఎంపీ మాదే

4
– విపక్షాలకు డిపాజిట్లు గల్లంతు

– మంత్రి పోచారం

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి):

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం విూర్జాపూర్‌ కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు మంత్రి పోచారం ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ లో చేరారు. అందరికీ టిఆర్‌ఎస్‌ కండువాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారదర్శకంగా సుపరిపాలన అందిస్తోందని మంత్రి పోచారం చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలు వరంగల్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని పోచారం విమర్శించారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌ లో విపక్షాలకు డిపాజిట్లు కూడా రావని తేల్చిచెప్పారు. వరంగల్‌లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకడం లేదని పోచారం ఎద్దేవా చేశారు. వాళ్లెన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ టీఆర్‌ఎస్‌ కు మద్దతిస్తున్నాయని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులను తాము చేస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు. గోదావరి, కృష్ణానదుల్లో బొట్టుబొట్టును ఒడిసిపడుతామని స్పష్టం చేశారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని, త్వరలోనే మిగతా బకాయిలు రూ. 8వేల కోట్లను బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. ఖర్చుకు వెనకాడకుండా పేదలకు సౌకర్యవంతమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని పోచారం చెప్పారు.