వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ
హైద్రాబాద్,నవంబర్4(జనంసాక్షి):
కాంగ్రెస్‌లో రాజకీయాలు వేగంగా మారాయి. ప్రస్తుత ఎంపి అభ్యర్థి రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య స్థానంలో సర్వే సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. నామినేషన్లకు బుధవారమే గడవు ఉండడంతో వెంటనే నిర్ణయం తీసుకుంది. ఘటన జరిగిన వెంటనే సర్వే సత్యనారాయణతో కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా సర్వే సత్యనారాయణ తో మాట్లాడారు. దీంతో ఆయన వెంటనే హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖాళీ బీఫామ్‌తో వరంగల్ బయలుదేరారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలుత సిరిసిల్ల రాజయ్యను ఎంపిక చేశారు. అయితే తెల్లవారుజామున రాజయ్య నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనువళ్లు మృతి చెందారు. దీంతో రాజయ్య కుటుంబలో పెను విషాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని రాజయ్య కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం సర్వే సత్యనారాయణను వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. కొత్త అభ్యర్థి కోసం ఉదయం నుంచి మంతనాలు నిర్వహించిన అనంతరం సర్వే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.