వరంగల్ సభతో విపక్షాలకు మాటరావడం లేదు : ఎమ్మెల్యే
జనగామ,అక్టోబర్23(జనంసాక్షి): వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో అటు పత్తిరైతుల, ఇటు చేనేత కార్మికుల గోస తీరనుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిఎం సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనం చూసి విపక్షాలు నిద్రపట్టడం లేదన్నారు. వచ్చే ఎన్నికల గురించి ఇక వారు మరచి పోవాలన్నారు. ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలోనే సీఎం నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతీ ఊరు పచ్చగా పంట పొలాలతో కళకళ లాడాలనేదే కేసీఆర్ సంకల్పమన్నారు. గత రెండున్నరేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటానికి మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల
నిర్మాణం వంటివి చేపట్టారన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి చెరువు, కుంటకూ గోదావరి జలాలు తెప్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్టాన్న్రి ముందు వరుసలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ కంకణ బద్ధుడయ్యారని, ప్రపంచదేశాల్లో తెలంగాణ పేరు మార్మోగేలా అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. మూడున్నర ఏళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలనను వివరించారు.
రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదవరెడ్డి అన్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోకుండా రైతులు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలన్నారు. గిట్టుబాటు ధరలు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.అంబేద్కర్ స్ఫూర్తిగా చిన్న రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడి సఫలీకృతమైన కేసీఆర్ ఆశించిన ఫలితాలు వస్తుండడంతో జిల్లాల పునర్విభజన చేపట్టి చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారని అన్నారు. చిన్న జిల్లాలతో తెలంగాణ సత్వర అభివృద్ధి జరిగి, బంగారుతెలంగాణ కాగలదని తెలిపారు. జనగామ అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.