వరదలతో నష్టపోయిన పంటలపై నివేదిక

అధికారులను ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌,జూలై16(జనం సాక్షి ): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంత్రి వరదలపై అన్నిశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు, ఆస్తి, పంట నష్టం, బాధితులకు అందుతున్న సహాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎడతెరపి లేని వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని అధికారులకు దిశానిర్ధేశర చేశారు. రైతు వారీగా వివరాలను సర్వేలో నమోదు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.