వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి – అసెంబ్లీ సమావేశంలో రైతుల పక్షాన గళమెత్తిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద వల్ల దాదాపుగా 40 వేల కుటుంబాలకు, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అధికారులతో పరిశీలన చేసి ప్రభుత్వం నష్టపరిహారం అందించి బాధితులను ఆదుకోవాలని మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన, వరద బాధితుల పక్షాన తన గొంతు వినిపించారు. వేలాది ఎకరాలలో పంట పొలాల్లో ఇసుక మీటలు వేశాయి అని, ఇసుక మేటలు వేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. మంథని పట్టణంలో వార్డ్స్,షాప్స్, ఇతర గ్రామాల్లో ఇండ్లకు గత సంవత్సరంలో వరద నీరు చేరిన ప్రతి ఇంటికి ముఖ్య మంత్రి హామీ మేరకు 10 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇసుక మాఫియా వల్ల రైతుల పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు, ఇసుక వ్యాపారులు పెద్ద ఎత్తున కుప్పలుగా నిల్వ చేయడం తో భారీ వరదలకు పొలాల్లో ఐదు నుండి పది ఫీట్ల మేర ఇసుక మేటలు వేశాయని, చెక్ డ్యామ్ ల నిర్మాణం శాస్త్రీయంగా చేయక పోవడం వలన వరదలు వచ్చి రైతులు తమ పంటలను నష్టపోవాల్సి వచ్చింది అన్నారు.
కాలేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతుల భూములను సర్వే చేసి నష్టపరిహారం అందించాలన్నారు. తమ మంథని నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లోని అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రిలిమినరీ రిపోర్ట్ 5200 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని సమగ్ర సర్వే జరిపి వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమ మంథని ప్రాంతాలకు సంబంధించి చాలా గ్రామాలు ముంపు కు గురవుతున్నాయని కరకట్టల నిర్మించి ముంపుకు గురికాకుండా చూడాలని కోరారు. దామెరకుంట,గంగారం, విలాసాగర్, అన్నారం, సూరారం, ఖాన పూర్, అరెంద, వెంకట పూర్, మల్లారం గ్రామంలో ముంపు గురైన ప్రాంతాలకు నష్టపరిహరం అందించి రైతులను ఆదుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.