వరదల కారణంగా 19,071 మంది తరలింపు

గోదావరి పరివాహకంలో వరద ఉధృతితో తక్షణచర్యలు
భారీగా నష్టం జరగలేదని గుర్తించిన ప్రభుత్వం
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పంటకు భారీగా నష్టం
అధికారులతో పరిస్థితిని సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రమాదంలో ఉన్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఏవిధమైన భారీ నష్టం జరగలేదని తెలిపారు. ప్రధానంగా గోదావరీ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడనట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై సోమేశ్‌కుమార్‌ గురువారం అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 16 మందిని రక్షించాయని, మరో ఇద్దరిని వైమానికదళం రక్షించిందని సోమేశ్‌ కుమార్‌ వెల్లడిరచారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6318 మందికి, ములుగు జిల్లాలో 33 క్యాంప్‌ లలో 4049 మందికి భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్‌ లలో 1226 మందికి ఆశ్రయం కల్పించి నట్లుగా సోమేశ్‌ కుమార్‌ వివరించారు.పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భారీ నష్టం జరగలేదని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలో ఇటీవలే విత్తిన, మొలక దశలో ఉన్న వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వర్షపాతం భారీగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో సోయాబీన్‌, 3 వేల ఎకరాల్లో కంది పనికి రాకుండా మారాయి. ఈ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిర్మల్‌ జిల్లాలో 12 వేల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అల్లాదుర్గం, రేగోడ్‌, టేక్మాల్‌, హవేలీ ఘన్‌పూర్‌, నర్సాపూర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, కౌడిపల్లి మండలాల్లో ప్రధాన పంటలతో పాటు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్‌ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మునిగాయి. పెద్దపల్లి జిల్లాలో 4,246 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వరి, మొక్కజొన్న నీటిలో నానుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 45 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో ఇతర పంటలూ ఇదే స్థితిలో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 వేల ఎకరాల్లో నాట్లు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న, కంది, పెసర మునిగిపోయాయి. జగిత్యాల జిల్లాలో 17,500 ఎకరాల్లోని పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో 14 మండలాల పరిధిలోని 286 గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీని విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో మాత్రమే పంట నష్టం స్వల్ఫంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదల కారణంగా 130 గ్రామాల్లో పంటలు మునిగాయి.