వరిధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలి సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
చేర్యాల (జనంసాక్షి) జూన్ 10 : వరిధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం చేర్యాల మండలం వేచరేణి, చుంచనకోట, తాడూరు, చిట్యాల, మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు జరుగుతుంది. మిల్లులకు ఎలా రవాణా చేస్తున్నారు. రవాణాకు ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా, ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందో తదితర విషయాలపై పరిశీలించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో త్వరగా వరిధాన్యం సేకరణ పూర్తి కావాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చిన వెంటనే తేమ శాతం కొలిసి నిర్ణీత తేమశాతం రాగానే కొనుగోలు చేసి ఏ క్షణంలోనైనా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా వాహనాల ద్వారా మిల్లులకు చేరవేయాలన్నారు. రవాణా వాహనాల సమస్య తలెత్తితే తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల తహశీల్దార్ ఎస్.కే ఆరిఫా, గీర్దావర్ రాజేందర్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబూరావు, వీఆర్ఓ కుమారస్వామి, అగ్రిప్ప, దాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.