వరి పట్ల విముఖత చూపేలా చర్యలు ! 

యాసంగిలో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఓ వైపు ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న గందరగోళం మధ్య యాసంగికి మళ్లీ వరి వద్దన్న విషయాలను ప్రచారం చేస్తోంది. అనేక చోట్ల ధాన్యం కొనాలంటూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ ఆపూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రైతులు మార్కెట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు మోకాలడ్డుతోందన్న ప్రచారంతో వరి వేయకుండా రైతులను నిరుత్సాహపరిచే విధంగా యత్నిస్తున్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సాహించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం ఈ దిశగా కసరత్తు ప్రారంభిం చింది. వానాకాలంలో వరిసాగు చేసిన రైతుల జాబితాల ఆధారంగా యాసంగిలో ఎవరెవరు రెండో పంట వేసే అవకాశాలు ఉన్నాయో గుర్తించి వారిని జొన్న, కొర్రలు, సామలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో పాటు శనగ, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దీంతో పాటు స్వల్పకాలిక కూరగాయల పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా జిల్లాల వ్యవసాయధి కారులు వెల్లడిరచారు. సాగునీటి వసతి లేనిచోట్ల ఆరుతడి పంటలు వేస్తేనే రైతులకు సులభంగా ఉంటుం దని సూచిస్తున్నారు. చిరు ధాన్యాల పంటల సాగు వల్ల మార్కెటింగ్‌ పరమైన సమస్యలు కూడా రైతులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు జిల్లాల వారీగా ప్రచారం మొదుల పెట్టారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సాగు చేస్తున్న వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ దఫా చేతులెత్తేసింది. రైతులు వరిసాగు చేయకుండా ముందస్తుగా నిరోధించడం ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల్లో వ్యవసాయ శాఖాధికారులు ఇందుకు సంబంధించి విత్తన దుకాణాలకు తాకీదులు జారీ చేశారు. జిల్లాల్లోని విత్తన, ఎరువుల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్‌ సమక్షంలో వరిసాగుకు సంబంధించిన విత్తనాల విక్రయాలు జరపవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి చేసిన హెచ్చరికలు సంచలనం రేపాయి. అలాగే హైకోర్టులో కేసు కూడా పడిరది. ఈ క్రమంలో అధికారులు మాత్రం వరివేయవద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దొడ్డి దారిన విత్తనాలు వక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పేర్కొంటున్నారు. విత్తనాలు అమ్మినట్లు తేలితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామంటూ బెదిరించినట్లుగా డీలర్లు చెబుతున్నారు. వాస్తవానికి వానాకాలం, యాసంగి రెండు సీజన్ల లోనూ వరి సాగు అంతంత సాగునీటి వసతి లేకపోవడం వల్ల రైతాంగం ఎక్కువగా వాణిజ్య పంట అయిన పత్తిని సాగు చేస్తున్నారు. అక్కడక్కడ వరి సాగు చేస్తున్నా గొట్టపు బావులు, చిన్న నీటి వనరుల కిందే పంటలు వేస్తున్నారు. అదికూడా వాణిజ్య స్థాయిలో చేస్తున్న సాగు కాకుండా కేవలం ఇంటి అవసరాల కోసం సాగు చేసేదే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రబిలో పంటలు వేసుకునేందుకు రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం తాము వ్యక్తిగత అవసరాలకు కూడా వరి సాగు చేయొద్దని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. ఎకరా, రెండెకరాలు సాగు చేసుకొని ఇంటి అవసరాలు, విత్తనాల కోసం పంటలు వేసుకోవ చ్చంటున్నారు. కేవలం వాణిజ్య కోణంలో మాత్రమే పంటలు సాగు చేయొద్దని చెబుతున్నామని పేర్కొనడం ఇక్కడ గమనార్హం. రైతులు సాంప్రదాయ పద్ధతిలో సమకూరిన విత్తనాలను ఉపయోగించి
యాసంగి వరి సాగు చేసినా విక్రయాలకు తెస్తే మాత్రం కొనే పరిస్థితి ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని డీలర్లకు అవగాహన కల్పించామంటున్నారు. మరోవైపు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదు. ప్రధానంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైస్‌మిల్లర్లు సుముఖత చూపకపోవడంతో కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం నెలకొంటుందని రైతులు, అధికారులు చెబుతున్నారు. ఇదంతా సాకుగా చూపి రైతులను వరి వేయచవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం సేకరణ నిలిచిపోతుంది. రైతులు కేంద్రాల వద్దకు వరి రాసుల ను భారీగా తరలిస్తున్నారు. మరోవైపు కురుస్తున్న అకాల వర్షాలకు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడం ఆ ధాన్యాన్ని ఆరబెట్టే క్రమంలో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. వరి ధాన్యం కేంద్రాలకు భారీగా వస్తున్నందున అధికారులు వెంటనే పూర్తిస్థాయి కొనుగోలు కేంద్రాలను తెరవాలని రైతుల నుంచి డిమాండ్‌ వస్తోంది. జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు ఉన్నాయి. ఓ వైపు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరువక పోవడం,మరోవైపు తెరుచు కున్న కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగకపోవడంతో భారీగా ధాన్యం నిలిచిపోతుంది. ఏ కేంద్రాల్లో చూసిన ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తు న్నాయి. దీంతో కొనుగోళ్లకై రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తేమ శాతం వచ్చేందుకు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఇదే క్రమంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం కాస్తా తడిసిపోతుంది. దీంతో ధాన్యాన్ని కాపాడు కునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం వర్షానికి తడవ కుండా ఉండేందుకు టార్పాలీన్లు, బార్దన్‌లు అందుబాటులో ఉంచడం లేదని దీంతో వర్షాలు కురిసినప్పుడు ధాన్యం తడిసిపోతుందని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడారైతుల్లో వరిపట్ల విముఖత పెంచడానికే అన్న ఆరోపణలు ఉన్నాయి.