వరుసగా ఢీకొన్న బస్సులు

నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న సమయంలో అదే మార్గంలో వెనుక వస్తున్న నాలుగు ప్రైవేటు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులను తొలగించేందుకు వచ్చిన భారీ క్రేన్‌ విరిగి రోడ్డుపై అడ్డంగా పడటంతో సహాయ చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.