వర్గీకరణ పై తాడోపేడో తేల్చుకుంటాం
శివ్వంపేట సెప్టెంబర్ 21 జనంసాక్షి :వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇక తాడో పేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, చెట్లపల్లి యాదగిరి మాదిగ, సర్గల పర్శరాములు మాదిగ, చెట్లపల్లి చంద్రశేఖర్ మాదిగ, దాసు మాదిగలు అన్నారు. బుధవారం శివ్వoపేట మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదాసీన వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. 28 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రాణ త్యాగాలకు వెనుకాడని చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందన్నారు. అనేక సామాజిక ఉద్యమాలతో అన్ని వర్గాల మన్ననలు పొందిన ఎమ్మార్పీఎస్ ను బలహీన పరిచేందుకు ప్రభుత్వాలు కుట్ర చేసిన ఆ కుట్రలను ఎదుర్కొని ప్రభుత్వాల మోసాలపై ఇప్పటికీ అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాల వల్ల ఎస్సీ, ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి కైనా కేంద్రంలోని బిజెపి, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కృషి చేయాలని, లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎలాంటి కార్యక్రమాలకైనా వెనుకాడేది లేదన్నారు. ఇందుకోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మెదక్ జిల్లాలో గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కమిటీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య మాదిగ, బంగారుగని రాజు మాదిగ, భూపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.