వర్షాలతో నగరంలో పొంగిన నాలాలు

లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నిలిచిన నీరు
గచ్చిబౌలికి వెళ్లే వాహనాలకు అంతరాయం

హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): శుక్రవారం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ తడిసి ముద్దవ్వడమే గాకుండా నాలాలు పొంగాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు హైదరాబాద్‌ లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరింది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. బ్రిడ్జి కిందనుంచి ఎవరూ వెళ్లకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో.. ఇరువైపుల నుంచి ఎవరినీ రానివ్వకుండం లేదు. ఇక చేసేది ఏవిూలేక నల్లగండ్ల ఫ్లైల ఓవర్‌ నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. డ్రైనీజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.