వసతి గృహ విద్యార్థుల పట్ల శ్రద్ధ చేపట్టాలి

వసతి గృహాలలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు ఆయన ఆత్మకూర్.ఎం మండలం వెనుకబడిన తరగతుల బాలురు, బాలికల హాస్టల్స్ సందర్శించి వసతులను పరిశీలించారు. బాలికల హాస్టల్లో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని, బయటి నీరు లోపలకు రాకుండా చర్యలు తీసుకోవాలని, కిచెన్, టాయ్లెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
అనంతరం షెడ్యూల్డు కులాల బాలికల, బాలుర వసతి గృహాలలో కిచెన్, టాయ్లెట్స్, గదులను పరిశీలించారు. తదుపరి కస్తూరిబా విద్యాలయంలో వంట గదిని, టాయిలెట్స్ పరిశీలించారు. డ్రైనేజీ నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని, పిల్లలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని తెలిపారు.
విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వసతి గృహాలలో వసతులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్.సి. సంక్షేమ అధికారి జయపాల్ రెడ్డి, బి.సి. సంక్షేమ అధికారి యాదయ్య, ఎం.పి.డి.ఓ. యాదగిరి, ఎం.పి.ఓ. పద్మావతి, సర్పంచ్ కె.నగేశ్, ఎం.పి.టి.సి. కవిత, వసతి గృహాల సిబ్బంది ఉన్నారు.