వాజ్‌పేయికి అస్వస్థత

-ఏఎంసీలో చేరిక

– పలువురి ప్రముఖుల పరామర్శ

న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి):మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వాజ్‌పేయిని తరలించినట్లు బీజేపీ ప్రకటించింది. ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో వాజ్‌పేయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.సోమవారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావటంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది. అయితే రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్‌ నోట్‌ విూడియాకు విడుదల చేశారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్‌ విూడియాలో పలువురు సందేశాలు పెడుతున్నారు.