వాటర్‌గ్రిడ్ భేష్
– యూపీ సీఎంతో మంత్రి కేటీఆర్ భేటీ
లక్నో అక్టోబర్ 15 (జనంసాక్షి):
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జాతీయస్థాయితో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశంసలు లభిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు లక్నో వెళ్లిన మంత్రి కేటీఆర్ బృందం వాటర్ గ్రిడ్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, పరిశ్రమలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని చెప్పారు. ఆ తర్వాత అఖిలేష్ విలేకరులతో మాట్లాడారు.వాటర్ గ్రిడ్ పథకం భవిష్యత్ లో తప్పకుండా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి పథకాన్ని చేపట్టాల్సిందేనన్నారు. స్వచ్ఛమైన తాగునీటిని పేద, గ్రావిూణ ప్రజలకు తప్పకుండా అందించాల్సిందేనని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లేయినా యూపీలోని బుందేల్ ఖండ్, విూర్జాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా మహిళలు, వారి కుటుంబ సభ్యులు నీటి కోసం కిలోవిూటర్ల దూరం వెళ్తున్నారని అఖిలేష్ చెప్పారు. ఇలాంటి పరిస్థితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉందన్నారు.ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారని, తన నియోజకవర్గంలో ముందుగా ప్రతి ఇంటికి నీటిని అందించారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వివరించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దీన్ని రెండు శాఖలు నిర్వహిస్తున్న కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టారు. చాలా రాష్ట్రాలు త్వరలోనే ఇలాంటి ప్రాజెక్టులు చేపడతాయని అఖిలేష్ అన్నారు. ఈ పథకం గురించి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు. యూపీలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని అఖిలేష్ ప్రకటించారు. ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.