వాట్సాప్ కొత్త అప్‌డేట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాట్ లాక్, వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్, హెచ్‌డీ ఫొటో షేరింగ్ వంటి సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందించింది.
ఇప్పుడు కొత్త రూపులో వాట్సాప్ యూజర్ల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న చాట్ పేజ్‌లో పై భాగంలో బార్‌ను తీసుకురానుంది. దీని కోసం యూజర్ ఇంటర్ ఫేస్‌లో మార్పులు చేస్తోంది. మనకు కావల్సిన వ్యక్తుల చాట్‌లను త్వరగా వెతకటానికి ఉపయోగపడేటట్లుగా వాట్సాప్ కొత్త రూపు ఉండనుంది.
సాధారణంగా వాట్సాప్ చాట్ బార్‌లో మనం మెసేజ్‌లు చేసే అందరి కాంటాక్ట్స్ ఉంటాయి. అందులోనే ఫ్రెండ్స్, వ్యక్తిగత చాట్‌లు, వృత్తిపరమైనవి లేదా వ్యాపారానికి సంబంధించినవి ఇలా అన్ని కలసి ఉంటాయి. మనకు కావల్సిన వ్యక్తితో చాట్ చేయాలంటే అంత పెద్ద లిస్ట్‌లో వెతుక్కోవాలి. లేదా సెర్చ్ బార్‌ను ఉపయోగించాలి. ఇక ఆ అవసరం లేకుండా సులువుగా చాట్‌లను తెలుసుకొనే విధంగా వాట్సాప్ పర్సనల్ ఇంటర్ ఫేస్‌లో మార్పులు తీసుకొస్తోంది. దీంతో వాట్సాప్ కొత్త రూపం దాల్చనుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే టాప్‌లో బార్ కనిపిస్తుంది. అందులో ఆల్, అన్‌రీడ్, పర్సనల్, బిజినెస్ ట్యాబ్‌లు కనిపిస్తాయి. దీంతో సులభంగా మీ చాట్‌లను వెతుక్కోవచ్చు.
ఇక వాట్సాప్ పై భాగంలో గ్రీన్ కలర్ ఉండదు. వాట్సాప్ అని టెక్ట్స్ గ్రీన్ కలర్‌తో ఉంటూ కెమెరా, సెర్చ్ ఆప్షన్లు పై భాగంలో ఉంటాయి. ఇక కింది భాగంలో చాట్, స్టేటస్, కాంటాక్ట్స్, కాల్స్ ఆప్షన్లను ఉంటాయి. అయితే ప్రస్తుతం వాట్సాప్ కొత్త రూపు అభివృద్ధి దశలోనే ఉంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా రూజర్లకు ముందుగా వినియోగించటానికి అందుబాటులోకి తీసుకురానుంది.