వాట్సాప్ చాట్ లపై సంపూర్ణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
విలేకరుల సమావేశంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్
మంథని, జనంసాక్షి : తనకు సోషల్ మీడియా వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారం మీద సంపూర్ణ విచారణ జరిపి సదరు వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ కోరారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సెంటనరి కాలనీలో తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా వాట్స్ ఆప్ నంబరుకు అంతర్జాతీయ నంబరు నుండి మూడు వాయిస్ మెస్సేజేస్, ఐదు స్కీన్ షాట్ మెస్సేజేస్ వచ్చాయని తెలిపారు. వాటిని ఓపెన్ చేసి చూడగా ఒక వ్యక్తి మంథని బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్త ఇనుముల సతీష్ లను చంపడానికి పురమాయించినట్లు ఉన్నదన్నారు. అదే విధంగా గతంలో జరిగిన గట్టువామన్ రావు న్యాయవాద దంపతుల హత్య లో వీరిద్దరి ప్రమేయంతో జరిగినట్లు ఆ వాట్సప్ చాట్ లో ఉందన్నారు. ఈ వాట్స్అప్ చాట్లపై సోమవారం గోదావరిఖని ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు సోషల్ మీడియా చాట్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సెగ్గం రాజేష్, రావికంటి సతీష్, వడ్నాల శ్రీనివాస్, అయేషా తదితరులు పాల్గొన్నారు.