వాతావరణంలో మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):వాతావరణంలో మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ నందు ప్రభుత్వ వైద్యులు ,సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.దోమల తీవ్రత పెరిగి వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉందని, డెంగ్యూ, మలేరియా, ఇతర కీటక జనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే డ్రైడే యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని కోరారు.ఆహార పదార్థాలకు మూతలు ఉంచాలని, ఈగలు వాలకుండా చూసుకోవాలని, డయేరియా వ్యాధికి గురికాకుండా నీటిని కాచి చల్లార్చి వడగట్టి తాగాలని సూచించారు.నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిలో లార్వాలు పెరగకుండా చూడాలన్నారు.కలుషిత నీటి ద్వారా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా వీధుల వెంట లభించే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.టిబి కేసులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలన్నారు.అసంక్రమిత వ్యాధుల నివారణ కొరకు అన్ని గ్రామాలలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్య శ్రీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆసుపత్రి అభివృద్ధి సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచాలని అన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ డిఏంహెచ్ఓలు డాక్టర్ నిరంజన్, డాక్టర్ హర్షవర్ధన్ , జిల్లా టీకాల అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా క్షయ, కుష్టు నివారణ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ , అంజయ్య, కిరణ్, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
 

తాజావార్తలు