వాద్రా అక్రమాస్తులకు అధారాలివిగో

డీఎల్‌ఎఫ్‌ సంస్థతో హర్యానా ప్రభుత్వం కుమ్మక్కైంది

వాద్రాపై మళ్లీ విరుచుకుపడిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌  9 (జనంసాక్షి) :

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై ఇండియా అగెనెస్ట్‌ సంస్థ సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మరిన్ని ఆరోపణలు సంధించారు. ఈ నెల 2న తొలిసారిగా వాద్రాపై కేజ్రీవాల్‌ ఆరోపణలు చేశారు. వీటిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, వాటిని వెల్లడిస్తానని ప్రకటించిన కేజ్రీవాల్‌ మంగళవారం మీడియా సమావేశంలో వాద్రాపై మరిన్ని ఆరోపణలు గుప్పించారు. వాద్రా ఆస్తులపై తాను మరిన్ని ఆధారాలు సేకరించానని నల్ల ధనంతో ఆయన ఆస్తులు విపరీతంగా పెరిగాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. డీఎల్‌ఎఫ్‌ సంస్థతో హార్యానా ప్రభుత్వం కుమ్మక్కైందని, ఇదంతా వాద్రా కోసమే జరిగిందని ఆరోపించారు. వాద్రాకు డీఎల్‌ఎఫ్‌ సంస్థ రూ.60 కోట్ల వడ్డీలేని రుణాన్ని ఇచ్చిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలకు కేటాయించాల్సిన భూములను హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కి ఇచ్చిందని ఆరోపించారు. దాదాపు 300 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ సంస్థకు కట్టబెట్టిందన్నారు. వాద్రా డీఎల్‌ఎఫ్‌ల మధ్య సంబంధాల్లో అవినీతి చోటు చేసుకుందని చెప్పారు. ప్రభుత్వంతో వీరు కుమ్మక్కైన విషయాన్ని హర్యానా కోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. డీఎల్‌ఎఫ్‌ సెజ్‌లలో వాద్రాకు 50 శాతం వాటాలున్నాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. వాద్రా అక్రమాస్తులకు సంబంధించి పలువురు తమకు వివరాలు పంపించారని తెలిపారు. హర్యానాప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌ సంస్థ ఏజెంటుగా పని చేసిందని విమర్శించారు. ఆ సంస్థకు భూములు కేటాయింపులతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. భూకేటాయింపులపై హర్యానా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గుర్‌గావ్‌లో రూ.1500 కోట్ల విలువైన భూమిని అక్రమంగా కేటాయించారని హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌ సంస్థ కుమ్మక్కైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.