వామ్మో విమానంలోంచి దూకేశాడు
లాస్‌ఎంజిల్స్,జులై 31(జనంసాక్షి):గాలిలో 25 వేల అడుగుల(7.6 కిలోవిూటర్ల) ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్ లేకుండా అమాంతం కిందికి దూకితే.. దాదాపు
మటన్ కీమాలా మనిషి శరీరం నుజ్జునుజ్జుకావడం ఖాయం. ఇంకెవరో దూకితే అదే జరుగుండేంది. కానీ ఆ సాహసం చేసింది లూక్ ఐకిన్స్.. ది డేర్ డెవిల్ స్కైడైవర్!గాలిలో ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్ల నుంచి లెక్కలేనన్నిసార్లు(నిజానికి 18వేల సార్లు) కిందికి దూకి స్కైడైవింగ్ సాహసక్రీడకు మరింత క్రేజ్ పెంచిన లూక్.. స్వదేశం అమెరికాలోనేకాక ప్రపంచ దేశాల్లోనూ ఫేమస్ అయిపోయాడు. 42 ఏళ్ల లూక్.. గడిచిన 26 ఏళ్లుగా, అంటే తన 16వ ఏట నుంచే సాహస కృత్యాలు చేస్తున్నాడు. అయితే శనివారం అతనుచేసిన ఫీట్ మాత్రం అత్యంత భయంకర.. ప్రాణాంతకమైన ఫీట్.విత్ అవుట్ పారాచుట్ 25 వేల అడుగుల ఎత్తునుంచి ఇప్పటివరకు ఎవ్వరూ డైవ్ చెయ్యలేదు. అంత ఎత్తునుంచి దూకి సరాసరి నిర్దేశిత వలలోకే చేరుకున్నాడు లూక్. ఒకవేళ వల నుంచి పక్కకు పోయి ఉంటే ఈపాటికి అతని చావు వార్తలు చదువుకునేవాళ్లం. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సిటీకి సవిూపంలోగల సిమి వ్యాలిలో.. భూమి కి 400 అడుగుల ఎత్తులో 100 ఫీట్ల పొడవు, వెడల్పున్న వలను ఏర్పాటుచేశారు. విమానం నుంచి దూకినప్పుడు లూక్ వెంట ముగ్గురు సహాయకలున్నారు. అయితే కొద్ది దూరం తర్వాత వాళ్లు పారాచూట్ ల సహాయంతో కిందికి దిగారు. లూక్ ఒక్కడే పారాచూట్ వినియోగించకుండా నేలకు చేరుకున్నాడు.విమానం నుంచి అతను వలలో పడ్డప్పుడు అది 61 విూటర్లు కిందికి సాగిందంటే.. ఎంత వేగంగా దూసుకొచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. లూక్ భూమిని చేరుకోవడానికి రెండు నిమిషాల సమయం పట్టింది. ‘భూమికి చేరువ అవుతున్నకొద్దీ నేను స్తంభించిపోయినంతపనైంది’అంటూ సాహస అనుభవాన్ని పంచుకున్నాడు లూక్. ఫీట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన వెంటనే భార్య మోనికా, కొడుకు లోగన్ లను హత్తుకున్నాడు లూక్.