వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్,జూలై11(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిరదని ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిరదని తెలిపారు. వచ్చే 3రోజులపాటు తెలంగాణలో భారీ వర్షంతో పాటు.. నేడు రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటిదాకా రైతులను మురిపించిన చినుకు ఇప్పుడు ఆగకుండా కురుస్తూ నెమ్మదిగా వణుకూ పుట్టిస్తోంది. రెండ్రోజులుగా పడుతున్న వాన తగ్గేదేలేదన్నట్టుగా వరుసగా మూడోరోజూ ధారాపాతంగా కురిసింది. ఫలితంగా వరదలతో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లో పెద్దఎత్తున నీరు చేరుతోంది. కొన్ని అలుగు పోస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్నిచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా
పడ్డాయి. వరద ఉధృతికి పలుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. చాలా చోట్ల బడుల ఆవరణలోకి నీరు చేరుతోండటంతో చెరువులు తలపిస్తున్నాయి.