వారణాసిలో తొక్కిసలాట

169

– 24 మంది మృతి, పలువురికి గాయాలు

లక్నో,అక్టోబర్‌ 15(జనంసాక్షి): వారణాసిలో ఘోరం జరిగింది. వారణాసి-చందౌలి మధ్య రాజ్‌ఘాట్‌ వంతెనపై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో 19 మంది మృతి చెందినట్లు సమాచారం. బాబా జై గురుదేవ్‌ సభ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింతగా పెరగగలదని భావిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేప్టటారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు నష్ట పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే గోవాల్లో బ్రిక్స్‌ సభలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటన గురించి తెలియగానే తాను తీవ్ర ఆవేదనకు గురైనట్టు వెల్లడించారు. వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. బాబా జైగురు దేవ్‌ అధ్యాత్మిక సభ కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.  ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి 19 మంది చనిపోయారు. వీరిలో 14 మంది మహిళలున్నారు. గాయపడిన మరో 20 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులకు వైద్య సాయం అందడం బాగా ఆలస్యమైంది. దీంతో మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయి. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సభ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఊహించినదానికన్న ఎక్కువ మంది రావడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.