వాస్తవ సాగుదారులకు రైతుబంధు అందాలి: చాడ
సిద్దిపేట,మే23( జనం సాక్షి): రైతు బంధు పథకంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు కాదు అది రైతు రాబంధు పథకమన్నారు. వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి సాయమందించాలని అన్నారు. కౌలు రైతులను విస్మరించడం ఎంతవరనకు సబబని అన్నారు. నిజానికి వారే సాగుదారులని అన్నారు. గౌరవెల్లి భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్తామని చాడ స్పష్టం చేశారు. బుధవారం సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను చాడ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూప్రక్షాళన కంటే ముందు రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాన్నారు. రెవెన్యూశాఖలో లంచాలపై కేసీఆర్ విచారణ జరిపిస్తే తాము నిరూపించడానికి సిద్ధమని చాడ వెంకటరెడ్డి సవాల్ చేశారు.