విజయనగరలో కాంగ్రెస్‌ జయభేరీ

3వేల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్య రెడ్డి విజయం
బెంగళూరు, జూన్‌13(జ‌నం సాక్షి) : కర్ణాటకలోని జయనగర శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ జయభేరీ మోగించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్య రెడ్డి.. తన సవిూప భాజపా అభ్యర్థి ప్రహ్లాద్‌పై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 54,045ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థికి 50,270 ఓట్లు వచ్చాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల కోసం జయనగర నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి బీఎన్‌ విజయకుమార్‌ మరణంతో అక్కడ ఎన్నిక రద్దయ్యింది. దీంతో జూన్‌ 11న ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికలో భాజపా తరఫున విజయకుమార్‌ సోదరుడు బీఎన్‌ ప్రహ్లాద్‌.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు మరో 17మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా.. కర్ణాటకలో కాంగ్రెస్‌ాజేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో తమ కూటమి పార్టీ అయిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు జయనగర ఉప ఎన్నికల్లో జేడీఎస్‌ పోటీ నుంచి విరమించుకుంది. ఫలితాల్లో ఆది నుంచి ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్‌ సునాయాసంగా విజయం సాధించింది. ఇటీవల జరిగిన రాజరాజేశ్వరి నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్న గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విజయనగరం నియోజకవర్గంలో బీజేపీ గెలుపు సునాయాశమేనని తొలుత అందరూ భావించారు. కర్ణాటక ఎన్నికల అనంతరం రాజకీయ సవిూకరణలు మారిపోవడం, ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి జేడీఎస్‌ నేత కుమారస్వామికి సీఎం పీఠం ఇవ్వడంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో నిలిచిన సౌమ్యారెడ్డి గెలుపు సునాయాశంగా మారింది. ఇటీవల వరుస ఉప ఎన్నికల్లో ఢీలా పడుతూ వస్తున్న బీజేపీ తాజా ఫలితాల్లోనూ ఓటమిబాట పట్టడంతో బీజేపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.