విజయబాబుజీ.. ఎలా ఉన్నారు..

వీసీలో ఆంధ్రా వ్యక్తితో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నం సాక్షి) : ‘పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని, కానీ మా ప్రభుత్వం దాన్ని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తోందిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ‘ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన(పీఎంబీజేపీ)’ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ పథకం ద్వారా వారు ఎలా లబ్ధిపొందారు.. వారి ఆరోగ్య విశేషాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ లబ్ధిదారుడితో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడటం విశేషం. ఆంధప్రదేశ్‌కు చెందిన విజయ్‌ బాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకున్న ఆయన ఆ తర్వాత పీఎంబీజేపీ పథకం కింద డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విజయ్‌ బాబు పాల్గొని ప్రధాని మోదీతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. ఆయనతో కాసేపు తెలుగులో మాట్లాడారు. విజయ్‌ బాబుజీ.. ఎలా ఉన్నారు? బాగున్నారా?’ అని మోదీ తెలుగులో అడిగారు. ఆ తర్వాత విజయ్‌ బాబు మాట్లాడుతూ.. తాను మూడేళ్ల నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లు చెప్పారు. ‘ఏడాది పాటు ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటే చాలా ఖర్చయ్యింది. ఆ తర్వాతి నుంచి పీఎంబీజేపీ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటున్నాను. ఇప్పుడు ట్రీట్‌మెంట్‌ బాగుంది’ అని చెప్పారు. అందుకు ఖర్చేమైనా అవుతుందా అని మోదీ అడగ్గా.. ఎలాంటి ఖర్చు అవట్లేదని కేవలం మందులు మాత్రమే కొనుక్కుంటున్నానని చెప్పారు. ఆ మందులు కూడా జనౌషధి కేంద్రాల నుంచే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం తీసుకురాకపోతే తనలాంటి బడుగు, బలహీన వర్గాల వారు చనిపోయేవారని విజయ్‌ బాబు అన్నారు. ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ.. ‘ఈ పథకం ద్వారా మిగులుతున్న డబ్బులను మంచిగా వాడుకోండి. పిల్లలు, అమ్మాయిల చదువులకు ఉపయోగించండి. చేస్తారు కదా’ అని అన్నారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు 2016 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద తక్కువ ధరకే మోకాళ్ల మార్పిడి, గుండె స్టెంట్లు, డయాలసిస్‌ వంటి చికిత్స అందిస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను కూడా ఏర్పాటుచేశారు. వీటిలో 600లకు పైగా మందులు, 154 శస్త్రచికిత్స పరికరాలు తక్కువ ధరకే అందిస్తున్నారు.