విజయవాడలో జైనుల శాంతి ర్యాలీ

విజయవాడ,మే28( జ‌నం సాక్షి ): విజయవాడ నగరంలో సోమవారం ఉదయం జైనులు అహింసా ర్యాలీ నిర్వహించారు. శ్వేతాంబర జైనుల్లో ఒక విభాగమైన తేరాపంత్‌కు పీఠాధిపతి ఆచార్య మహాశ్రమన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అహింసా మార్గాన్ని, దాని ప్రయోజనాలను చాటిచెప్పేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతా నుంచి వివిధ రాష్ట్రాల విూదుగా ఆచార్య మహాశ్రమన్‌ విజయవాడకు కాలినడకన చేరుకున్నారు. గురునానక్‌ కాలనీ వద్ద జైనులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో గద్దె రామ్మోహన్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. అనంతరం తేరాపంత్‌ అసోషియన్‌ హాల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ర్యాలీ ప్రారంభించారు. గురునానక్‌ కాలనీ నుంచి మొగల్రాజపురం సిద్దార్థ కళాశాల వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో శ్వేతాంబర జైనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా విభాగం, యువజన విభాగం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అహింసా ధర్మాన్ని ప్రభోదించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగింది.