విజయాన్ని సోనియాకు కానుకగా ఇద్దాం

తెలంగాణ ఇచ్చిన తల్లిగా గౌరవిద్దాం: కోమటిరెడ్డి

నల్గొండ,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు విజయం అందించి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. చౌటుప్పల్‌ మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని 12 వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే.. ఆ విషయం తెలిసి.. తట్టుకోలేక సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. అయితే ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు నలుగురు కుటుంబ సబ్యుల మధ్య బందీ అయ్యిందన్నారు. తాము అధికారంలోకి రాగానే మునుగోడు నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు తాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభివృద్ది పనుల్లో కవిూషన్లు తీసుకుని కోట్ల రూపాయలు ఆర్జించారని ఆయన విమర్శించారు. మహాకూటమికి ఓటు వేసి టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు.