విదేశీ క్రీడాకారులకూ.. బురఖా నిబంధన 

 హెడ్‌కార్ఫ్‌ ధరించలేను.. నేను తప్పుకుంటున్నా
స్పష్టం చేసిన భారత్‌ చెస్‌ స్టార్‌ సౌమ్యా స్వామినాథన్‌
న్యూఢిల్లీ, జూన్‌13(జ‌నం సాక్షి) : భారత చెస్‌ స్టార్‌ సౌమ్య స్వామినాథన్‌ సోషల్‌విూడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఆసియా నేషనల్‌ కప్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ 2018 నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అరబ్‌ దేశాల్లో ముస్లిం మహిళలు తప్పనిసరిగా హెడ్‌స్కార్ఫ్‌ ధరించాలనే నియమం ఉన్న విషయం తెలిసిందే. విదేశీయులు ధరించడం తప్పనిసరికాదని కొన్ని దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఐతే ఇరాన్‌ చట్టాల ప్రకారం అక్కడ అడుగుపెట్టిన మహిళలు కచ్చితంగా హెడ్‌స్కార్ఫ్‌ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. ఈ కారణంతోనే సౌమ్య ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకుంది. వచ్చే జులై 26 నుంచి ఆగస్టు 4 మధ్య జరగనున్న ఆసియా నేషనల్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు ఇరాన్‌ ఆతిథ్యమిస్తోంది. అక్కడికి వెళ్లిన తరువాత హెడ్‌స్కార్ఫ్‌ లేదా బుర్ఖాను బలవంతంగా వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇరాన్‌ స్థానిక చట్టాలు ప్రాథమిక హక్కుల్లో ఒకటైన స్వేచ్ఛా హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయి. ఏదో ఒక మతానికి సంబంధించిన డ్రెస్‌కోడ్‌ను క్రీడల్లో బలవంతంగా అమలు చేయడానికి ఎప్పటికీ చోటులేదు. నా హక్కును కాపాడుకోవాలంటే మిగిలిన ఒకే ఒక దారి ఇరాన్‌కు వెళ్లకుండా ఉండటమే. ప్రతిసారీ భారత్‌ తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. ముఖ్యమైన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోతున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నా అని ఫేస్‌బుక్‌లో వివరించింది.