విదేశీ ‘చిల్లర’ పెట్టుబడులకు సీడబ్ల్యూసీ బాసట
తెలంగాణ చర్చ రాలేదట !
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి):
ఎఫ్‌డిఐలకు అనుమతి, డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలెండర్ల పరిమితితో పాటు పలు ఆర్థిక సంస్కరణలకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయ క మండలి -సిడబ్ల్యూసి మద్దతు పలికింది. ఆర్థిక సంస్కరణలో ఖచ్చితంగా అమలు చేయాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు సిడబ్ల్యూసి బాసటగా నిలిచింది. మరోవైపు సంస్కరణలకు అడ్డుపడు తున్న బిజెపిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్య తారహితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. మంగళవారంనాడు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణల అమలులో ఆటంకాలు ఎదురు కాకూడదని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌డిఐలకు సోనియా పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో విపక్షాలపై ఆమె దూకుడు ప్రదర్శిస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్థిక సంస్కరణలపట్ల ఆమె స్థిర వైఖరిని అవలంభిస్తూ గట్టి సందేశాన్ని పంపారు. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ సంస్కరణల పట్ల వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచాల్సిన సమయం అసన్నమయిందని అన్నారు. సోనియా ఆర్థిక సంస్కరణలు నేడు అత్యవసరమని అభివర్ణించారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడాన్ని సోనియా ప్రస్తావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. తృణమూల్ మద్దతు ఉపసంహరించిన ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్‌పి, ఎస్పీ మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తున్నాయని వాటి పేర్లు చెప్పకుండా పరోక్షంగా ప్రస్తావించారు. యుపిఎ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందన్నారు. అంతర్జాతీయంగా ఎంతో క్లిష్టంగా మారిన ఈ దశలో ఆర్థిక సంస్కరణల విషయంలో భారతదేశం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని సోనియా వివరించారు. ఈ సమావేశంలో సోనియా పూర్తిగా ప్రధానికి బాసటగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక గాడిన పడేవరకూ కష్టమైనా, ఆర్థిక సంస్కరణలను సానుకూలంగా అర్థం చేసుకుని వాటి అమలుకు అందరూ చేయూతనివ్వాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆ తర్వాత పరిస్థితులు చాలా విపత్కరంగా మారతాయని, అందువల్ల ఇప్పటినుంచే దేశం అప్రమత్తం కావలసి ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఆర్థిక సంస్కరణల ప్రభావం గురించి, వివిధ రంగాలలో ఆర్థిక సంస్కరణలను ఎలా అమలు చేయదలచిందీ వివరించారు. సి.డబ్ల్యూ.సి ఆర్థిక సంస్కరణల విషయంలో ప్రధానికి బాసటగా నిలిచింది.
ఈ సమావేశంలో తెలంగాణ గురించి చర్య ఏదీ జరగలేదని, ఎ.ఐ.సి.సి అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేది మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. కేవలం దేశ పరిస్థితుల గురించి మాత్రమే సి.డబ్ల్యూ.సిలో చర్చ జరిగిందని ఆయన వివరించారు. సి.డబ్ల్యూ.సి సభ్యుడు బి.కె. హరిప్రసాద్ కూడా ఈ సమావేశంలో తెలంగాణ గురించి చర్చ జరగలేదని వెల్లడించారు. వివేది మాట్లాడుతూ ఎఫ్‌డిఐలు ఇతర ఆర్థిక సంస్కరణలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ప్రజలకు సంస్కరణల అమలు ఆదర్శకతలను వివరిస్తామని చెప్పారు. 35మంది సభ్యులు సమావేశానికి హజరుకావల్సి ఉండగా హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు ఆరుగురు హాజరు కాలేకపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొన్నారు.