*విద్యను ఆయుధంగా మార్చుకొని ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకోవాలి*

*పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి*
*-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*
ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 18 విద్యార్థులు విద్యను ఆయుధంగా మార్చుకొని ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని షాబాద్, వావిలాల, ఉదండాపురం గ్రామాలలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నతంగా ఎదగాలని, విద్యార్థి దశలో కష్టపడితె జీవితాంతం సుఖపడవచ్చని అన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతిలో 10/10 మార్కులు సాధించేలా కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృధా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఉదండాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. 8 మంది ఉపాధ్యాయుగాను ఐదు మంది ఉపాధ్యాయులు సెలవు పెట్టి వెళ్లడంతో ఎవరితో పర్మిషన్ తీసుకుని వెళ్ళారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల వివరాలు, హాజరు పట్టిక, మధ్యాహ్న భోజనం తదితర అంశాలఫై ఆరా తీశారు. కలెక్టర్ స్వయంగా గణితపాఠ్య పుస్తకంలోని అంశాలను విద్యార్థులకు బోధించారు.
 అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులకు అందజేసే పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఎత్తు, బరువుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు  చేయాలన్నారు. పౌష్టికాహార కిట్లు అందజేయాలని అంగన్వాడీ టీచర్ కు ఆదేశించారు. అలాగే గ్రామాలలో చేపట్టిన మనఊరు మనబడి క్రింద మంజూరై నిర్మాణం చేపడుతున్న గదులను, ఇతర పనులను త్వరితగదిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తదనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలాని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు క్రీడా ప్రాంగణాలలో నీరు నిలిచి ఉండడం పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులు ఆడుకోవడానికి ఇబ్బంది కలగకుండా నీరు నిలువకుండ మరమ్మత్తులు చేపట్టాలని స్తానిక సర్పంచుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ సిరాజుద్దీన్, ఎంఇఓ రాజు, ఎంపీడీవో రాఘవ, తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, పిఆర్ ఏఈ పాండురంగారావు, ఆర్ఐ సుదర్శన్ రెడ్డి, ఎంపిఓ భాస్కర్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.