విద్యారంగానికి అధిక ప్రాధాన్యత: కడియం శ్రీహరి
నిర్మల్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.5.40కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 413 జూనియర్ కళాశాలలు ఉంటే కేవలం 17 కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు లేవన్నారు. కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతోనే జాప్యం ఏర్పడుతోందన్నారు.