విద్యార్థులంటే ఆణిముత్యాలు దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్(జనంసాక్షి) : విద్యార్థులంటే ఆణిముత్యాలని దేశభవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడు రోజుల పండగను జిల్లా వ్యాప్తంగా అందరూ జరుపుకోవాలని రాష్ట కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించడం జరుఉతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఎనిమిదేళ్లలో అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించామని ప్రతి ఇంటికి త్రాగునీరు, రైతులకు కోట్లాది ఎకరాలకు సాగునీరు, దళితులకు దళిత బంధు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ,యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ ,రైతుబంధు రైతు బీమా ,రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు. మొదటి రోజైన ఈ రోజు విద్యార్థుల పండగ కాగా శనివారం రోజున గిరిజనులల పండగ అని వారి కోసం హైదరాబాద్లో రూ.53 కోట్లతో నిర్మించిన బంజారా భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి లక్ష మందితో తరలివెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆణిముత్యాలని దేశభవిష్యత్తు మొత్తం వారి చేతుల్లోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని ఈ విషయంలో పేదలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకు, విదేశీ చదువులు అభ్యసించేందుకు ఉచితంగా విద్యనందిస్తున్నారని దీనిని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ విద్యను ముఖ్యమంత్రి కృషి వల్ల అందించడం జరుగుతుందని ఇలాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోందని వివరించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే అత్యున్నత రంగాల్లో రాణించాలని ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని సమావేశంలో మంత్రి తెలిపారు. ప్రతి పనిని అందులో లీనమై చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని ప్రపంచంలో ఉన్నతస్థితికి ఎదిగిన వారంతా విద్యార్థి దశలో మంచి చదువులు చదివిన వారేనని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి గొప్ప స్థితికి ఎదగాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను చేపట్టిన విషయాల గురించి మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు వివరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమం విజయవంతం అయ్యిందని శనివారం జాతీయ పతాకావిష్కరణ అనంతరం జిల్లా నుంచి హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమురమ్ భీమ్ ఆదివాసీ భవనాన్ని, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎనిమిదేళ్ళ కాలంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో 75వ వజ్రోత్సవ వేడుకలు జరుగుతుందని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం బలమైన అభివృద్ధి సాధించామని కలెక్టర్ తెలిపారు తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తనకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హరీష్ వివరించారు .
జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. హక్కులకై అనేకమంది పోరాడారని వారిని స్మరించుకుంటూ వారి వారి ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. సీఎం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రాన్ని అభివృద్ధిపథకంలో పయనింపచేస్తారని పేర్కొన్నారు.
సమావేశానికి ముందు కళాకారుల డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, విద్యార్థుల డ్యాన్స్లు, కేరింతలు, బోనాల ఊరేగింపు, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సందీప్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు,పార్టీ అధ్యక్షులు, నాయకులు,పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area