విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదునుపెట్టాలి: పాపిరెడ్డి
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెడితేనే జీవితంలో రాణించగలుగుతారని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో గల కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏకత్రా 2015’ కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి లద్ఘిర్మన్ పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి ఆయన ప్రసంగించారు. జేఎన్టీయూ పరిధిలోని 174 ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు కొరవడటంతో 2015లో అడ్మిషన్లు ప్రారంభం కాలేదన్నారు. సమర్థవంతమైన సిబ్బంది లేని కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారారని, అందులో కొంత మంది ఆటోడ్రైవర్లుగా, కొంత మంది సంఘ విద్రోహులుగా మారుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు సాంకేతిక ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల లద్ఘిర్మన్ నిరంజన్‌రెడ్డి, కరెస్పాండెంట్ కోట అబ్బిరెడ్డి, ప్రిన్సిపల్ దుర్గప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.