విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల
నిజామాబాద్, జూలై 18 : విద్యుత్ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో సబ్‌స్టేషన్ ఎదుట టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అమలు చేసిన సంస్కరణలో నేడు కాంగ్రెస్ సర్కార్ 9 గంటల పాటు విద్యుత్‌ని అందిస్తామని చెప్పి కేవలం 7 గంటలు కూడా అందించడం లేదని విమర్శించారు. ఉచిత కరెంటు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉచిత సలహాలు ఇస్తూ ప్రజలకు ఎసరు పెడుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 1500 మెగావాట్ల ఉత్పత్తి అవసరం కాగా, 13వేల మెగావాట్లనే ఉత్పత్తి చేయడానికి సమాయత్తం అవుతుందన్నారు. బొగ్గు, థర్మల్, సోలార్ ద్వారా రాష్ట్రంలో కేవలం 12వేల మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండగా, జల విద్యుత్ వల్ల కేవలం 3వేల మెగావాట్లు విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రాజెక్టుల్లో నీరు లేదని సీఎం చెబుతున్నారని, దీంతో విద్యుత్ కోతను విధించడం జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్ అందిస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకులే అంటున్నారని, 2004లో టిడిపి అన్నది నిజమైందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన కన్నా సీటును కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. కరెంటు సమస్యతో సతమతమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సర్ చార్జీల పేరిట విద్యుత్ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుందన్నారు. టిడిపి హయాంలోనే మెరుగైన విద్యుత్‌ను అందించామని, రైతులకు నిరాఘటంగా విద్యుత్‌ను అందించామన్నారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాల్లో కూరుకుని పోయి విద్యుత్ సరఫరాను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో 7 గంటల విద్యుత్‌నైనా అందించాలని, లేని పక్షంలో ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. టిడిపి నగర అధ్యక్షుడు అంబదాస్‌రావు మాట్లాడుతూ, విద్యుత్ సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, సీఎం చోద్యం చూస్తున్నారని అన్నారు. అనంతరం టిడిపి నాయకులు సబ్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆకుల శంకర్, భూమయ్య, నరేంధర్‌గౌడ్, రాజమల్లు, నవీన్ ఇక్బాల్, నర్సింలు, కాంత తదితరులు పాల్గొన్నారు.