విద్యుత్‌ బిల్లులు….విద్యుత్‌ కోతలు

విద్యుత్‌ బిల్లులు….విద్యుత్‌ కోతలు ఇప్పుడు తెలుగు రాష్టాల్రను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరు తెలుగు రాష్టాల్ల్రో వివిధ రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఫీల్‌గుడ్‌ వ్యవహారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. తెలంగాణలో బెటర్‌మెంట్‌ ఛార్జీలతో షాక్‌లు ఇస్తున్నారు. ఇక ఎపిలో వ్యవసాయ మోటర్లకు విూటర్లు బిగించడంతో పాటు..విద్యుత్‌ కోతలు ఆందోళనకు గురి చేస్తున్నారు. ఛార్జీల పెంపిఉ ఇప్పటికే మోపారు. ఇకపోతే తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నా..నష్టాలను భరించడానికి కెసిఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. వినియోగదారులకు దిమ్మతిరిగేల బిల్లులు వస్తున్నాయి. ఒక్కసారిగా వేల రూపాయల విద్యుత్‌ బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఏప్రిల్‌ నుంచి పెరుగుతున్న విద్యుత్‌ చార్జీలు ఇప్పుడే పెంచేసారా.. అన్న ఆందోళన కలిగిస్తోంది. చార్జీలు పెంచినా ఇంతగా బిల్లులు వస్తాయా అన్న ఆందోళనలో ఉన్నారు. బిల్లుల జారీలో ఎమైన పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయా అన్న సందిగ్ధంలో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. అయితే విద్యుత్‌ వినియోగంలో పెరిగిన లోడ్‌కు సంబంధించి డెవలప్‌మెంట్‌ చార్జీల రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌లు వసూలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది నుంచే ఈ డెవలప్‌మెంట్‌ చార్జీలు కట్టాలంటూ బిల్లుల కింద సూచించినప్పటికీ వినియోగదారులు గమనించలేకపోతున్నారని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బిల్లుల్లోనే కలిపి ప్రస్తుతం ఇవ్వడంతో బిల్లులు అధికంగా వచ్చాయంటున్నారు. కిలోవాట్‌ లోడ్‌ జీఎస్‌టీతో కలుపుకుని సుమారు రూ.1500 డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని విద్యుత్‌శాఖ చెబుతోంది. బాయిలకాడ విూటర్లు పెట్టమని చెబుతున్న కెసిఆర్‌..ఇలా గృహ వినియోగదారులపై ఎడాపెడా ఛార్జీలు వేస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. చెప్పాపెట్టకుండా వస్తున్న సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరికలు చేయకుండా విద్యుత్‌ ఫీజులు పీకి పోతున్నారు. డెవలప్‌మెంట్‌ చార్జీల కింద విద్యుత్‌శాఖ గృహ వినియోగం కనెక్షన్‌లకు బిల్లులు బాదుతోంది. వందల్లో వచ్చే బిల్లులు ప్రస్తుతం వేల రూపాయల్లో చార్జీలు వేస్తుండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. డెవలప్‌మెంట్‌ చార్జీల పేరుతో అదనపు బాదుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇళ్లలో ప్రతినెల రూ.200 నుంచి రూ.500లోపు విద్యుత్‌ బిల్లులు వస్తుండేవి. అయితే ఈ ఫిబ్రవరిలో దాదాపు ప్రతీ వినియోగదారుడికి విద్యుత్‌ బిల్లులు ఐదింతలు పెరిగి వేలల్లో వస్తున్నాయి. ఇవేమి బిల్లులని వినియోగదారులు విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించగా డెవలప్‌మెంట్‌ చార్జీలు కలిపి వస్తున్నాయంటూ సమాధానం చెబుతున్నారు. డెవలప్‌మెంట్‌ చార్జీలు ఒక్కసారి మాత్రమే వస్తాయని అవి తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. డెవలప్‌మెంట్‌ చార్జీల పేరిట అదనంగా విద్యుత్‌బిల్లులు వసూలు చేస్తున్నా రంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. ఇక ఎపిలో పరిస్థితి మరోలా ఉంది. పల్లెల్లో ఎప్పుడంటే అప్పుడు విద్యుత్‌ కట్‌ అవుతోంది. 9గంటల వ్యవసాయ విద్యుత్‌ అమలు కావడం లేదని రైతులు వాపోతు న్నారు. విద్యుత్‌ కోసం రాత్రిళ్లు రైతులు పొలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. లోడ్‌ పెరగడమే కారణం అంటున్న అధికారులు జిల్లాల్లో అనధికార విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో … ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చేవారు లేకపోవడం తో విద్యుత్‌ మోటార్ల వద్ద రైతులకు కాలం గడుపుతున్నారు. వేసవి ప్రారంభం కాకుండానే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. చిన్న పరిశ్రమలకూ విద్యుత్‌ కష్టలు
తప్పడం లేదు. వారబంది అమలు చేస్తుండటం వల్ల పూర్తిస్థాయిలో వరిసాగుకు నీరు అందటం లేదు. రాత్రిపూట ఫీడర్లు, సబ్‌స్టేషన్ల వారీగా కరెంటు ఇవ్వడంతో రైతులు వంతుల వారీగా రాత్రిపూటే పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే గ్రావిూణ ప్రాంతాల్లో అనధికార విద్యుత్‌ కోతలను అమలు చేశారు. ముఖ్యంగా విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిన సందర్భాల్లో గృహ విద్యుత్‌ వినియోగదారులకు సాయంత్రం, రాత్రి సమయాల్లో గంటనుంచి రెండుగంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ లోడ్‌ పెరిగిన సమయంలో అందుకు అనుగుణంగా డివిజన్ల వారీగా కోతలు విధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోతలు మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. వ్యవసాయ వ్యవసాయ సర్వీసులకూ గంటనుంచి రెండు గంటలపాటు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ అవసరా లకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండటం లేదని చెబుతున్నప్పటికీ చిన్నతరహా పరిశ్రమలకు కోతల బెడద తప్పటం లేదు. దీనితో రైతులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. రబీలో మొక్కజొన్న, జొన్న పంటలూ అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో 5గంటలకే కుదిస్తే ఎలాగని రైతులు మండిపడు తున్నారు. గ్రావిూణ ప్రాంతంలో 5 గంటల నుంచి 8 గంటలపాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో లోవోల్టేజ్‌ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. వ్యవసాయపంపు సెట్లకు ఉదయం 9గంటల విద్యుత్‌ సరఫరా చేయాల్సివుంది. అది సక్రమంగా అమలు కాకపోవడంతో మొక్కజొన్న, తెల్లజొన్న, అపరాల సాగుకు వ్యయ ప్రయాసలకోర్చి నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతు న్నారు. పట్టణ ప్రాతాల్లో రోజుమార్చి రోజు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్‌ లైన్ల మరమ్మతులు చేస్తున్నారు. దీనితో ఐదు గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవి ప్రారంభం ముందే కోతలు మొదలయ్యాయని ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం, గ్రామాల్లో విద్యుత్‌ కోతలతో రైతులు, సామాన్య ప్రజానీకం నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో వ్యవసాయానికి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంటు ఇవ్వకపోడంతో రైతులు విద్యుత్‌ మోటార్ల వద్ద కాలం గఉపుతున్నారు. డ్యామ్‌ల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ విద్యుత్‌ కోతలు విధించడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో వేలకోట్లను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎపిలో చార్జీలతో పాటు కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి.