విద్యుత్ సమస్యను అధిగమించాం
24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత తెరాసదే
దసరా నాటికి ఇంటింటికి నల్లానీరు ఇవ్వటమే కేసీఆర్ లక్ష్యం
పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి రూ.3వేల కోట్లు ఖర్చుచేశాం
రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు
కొల్లూరులో 33/11కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించిన మంత్రి
సంగారెడ్డి, జూన్13(జనం సాక్షి) : తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడుతుందని హెచ్చరించిన ఆంధ్రా మేధావుల మాటలను అబద్దాలు చేస్తూ కేసీఆర్ పట్టుదలతో నేడు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొల్లూరులో కొత్తగా నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. బీరంగూడ, కిష్టారెడ్డిపేటలో మరో రెండు సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొల్లూరు, అవిూన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యుత్ కోతలను అధిగమించామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకనే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో వేసవికాలం వచ్చిందంటే విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందన్నారు. పట్టుదలగా తీసుకొని కేసీఆర్ 24గంటల విద్యుత్ సరఫరాను చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళల బిందెతో రోడ్డెక్కకూడదన్న ఉద్దేశంతో ఇంటింటికి నల్లానీరు అందించేలా కేసీఆర్ అహర్నిశలు మానిటరింగ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దసరా పండుగ నాటికి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రూ. 3 వేల కోట్లను పటాన్‌చెరు నియోజకవర్గానికి అభివృద్ధి ఖర్చు చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాష్ట్ర రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.



