విద్వేషాలను రూపుమాపి.. దేశం మనవైపు చూసేలా చేశాం.

ఐటి, మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

 

రాజన్నసిరిసిల్లబ్యూరో, సెప్టెంబర్17.(జనం సాక్షి) రాష్ట్రంలో అభివృద్ధిలో ముందు నిలిపి దేశం మన వైపు చూసేలా చేసామని ఐటి మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.నాటికే నేటికీ తెలంగాణలో వచ్చిన మార్పులకు దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఎన్నో అనితరమైన పనులను సుసాధ్యం చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి , సంక్షేమంలో ముందంజలో నిలిపామని అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో భాగంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంత‌రం ఆయన మాట్లాడుతూ
1947 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్‌ విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని అందించాలని అన్నారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని అన్నారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 1948 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రంగా ఉందని..  రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పేరిట..హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారని అన్నారు. విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారన్నారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి 14 ఏళ్లు సిఎం కేసిఆర్ పోరాటం చేశారనీ గుర్తు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఇప్పుడు దేశానికే టార్చ్ బేరర్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయికంటే ముందుందన్నారు.
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు.

దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే..సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని..ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని అన్నారు. స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు.

 

మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన మంత్రి

జిల్లా కేంద్రంలో న్యాక్ ద్వారా 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టరేట్ లో ఒక్కొక్కటి రూపాయి రూ.6,500/- విలువైన 25 కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేమి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కే రవీందర్ రావు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఎస్పీ రాహుల్ హెగ్డే , జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి టి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు