వినుడి.. వినుడి.. టీజీ, గోపాల కథలు

తెలంగాణ ఉద్యమ ధాటికి అప్పుడప్పుడు కేంద్రంలో చలనం రావడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్న వార్తలు మీడియాలో రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలా జరిగినప్పుడు వెంటనే ఆ ఊపును చల్లార్చేందుకు ముందుండేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాయలసీమ నుంచి టీజీ వెంకటేశ్‌, ఇంకొకరు ఆంధ్ర గోపాలుడు లగడపాటి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా పైన చెప్పుకున్న విధంగా వార్తలు రావడం, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతోపాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, జాతీయ మీడియాలోనూ అర్ధరాత్రే కావచ్చు గాక, కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే అవకాశముందని ఓ వార్త ప్రసారమవ్వడంతో నిజంగానే తెలంగాణ వస్తుందేమోనన్న ఆశలు తెలంగాణవాదుల్లో మళ్లీ చిగురించాయి. అంతే.. కలహభోజనులైన టీజీ, లగడపాటికి మళ్లీ మస్తు ఆకలవ్వడం మొదలైంది. ఎక్కడ తెలంగాణ ఇచ్చేస్తారోనన్న గుబులు పట్టుకుంది. టీజీ వెంటనే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణ ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు గానీ.. మాకు రాయల తెలంగాణ అయితే ఓకే లేదా కేవలం తెలంగాణ మాత్రమే ఇస్తే మాకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఓ ప్రకటన చేసేశాడు. ఇక్కడే టీజీ కతంత్రం బట్టబయలవుతుంది. రాయల తెలంగాణకు ఎలాగో తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు కాబట్టి ఓ లక్ష కోట్లు లాక్కుందామనేదే ఆ వ్యాఖ్యల్లో ఉన్న కుట్ర. లక్ష ఇచ్చారే అనుకోండి. ఆ లక్ష కోట్లు రాయలసీమను రతనాలసీమగా మార్చే స్కీం ఏమైనా టీజీకి తెలుసా ? అయినా, రాయలసీమకు లక్ష కోట్లు ఇవ్వడమెందుకు ? రాయలసీమలో లక్ష కోట్లకు కొదువా ? అదీ ప్రభుత్వమివ్వడమెందుకు ? అక్కడి నాయకుల దగ్గర మనిషికింత చందా వేసుకున్నా లక్ష కోట్లు నిమిషంలో జమా అవుతాయి. ఒక్క వైఎస్‌ జగన్‌ కరుణించాడంటే.. వాళ్ల తాతముత్తాతల నుంచి వచ్చిన 48 కోట్ల ఆస్తి పోతే.. 42 వేల కోట్లు ఇవ్వొచ్చు. ఇంకొంచెం పొత్తు కలవడానికి జేసీ దివాకర్‌రెడ్డి, వైఎస్‌ అల్లుడు అనిల్‌ ఎలాగో ఉండనే ఉన్నారు. ఇంకా జనాన్ని బోల్తా కొట్టించి వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్న బురిడీ బాబాలకు రాయలసీమనే వేదిక కదా ! ఈ బాబాలు గానీ దయచూపితే ఇంకెవ్వరూ రాయలసీమకు సాయం చెయ్యనవసరం లేదు. ఇది గానీ అబద్ధమంటావా.. టీజీ.. ! ఒకవేళ ఇది అబద్ధమనుకుంటే ముందు వాళ్లందరిపై విచారణకు డిమాండ్‌ చెయ్‌. ఆ తర్వాత తెలంగాణపై అవాకులు చెవాకులు మాట్లాడుదువుగాని. ఇక మన బెజవాడ బడా బాబు రాజగోపాల్‌ ముచ్చట మాట్లాడితే తెలంగాణలో మెడికల్‌ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ నాయకులు గవర్నర్‌ను కలిస్తే లగడపాటికి రగడ రాజేయడానికి కావల్సినంత చెరకు దొరికినట్లయింది. అందుకే, ఆయన వెంటనే ఓ బహిరంగ లేఖ రాసి తెలంగాణలోనే మెడికల్‌ సీట్లు ఎక్కువగా ఉన్నాయని, లేవని భావిస్తే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చర్చకు రావాలని సవాల్‌ విసిరాడు. ఇతనికి తెలంగాణ అన్న పదం వినిపిస్తే చాలు.. చర్చలు, సమావేశాలు, డిమాండ్లు, రాజీనామాలు గుర్తుకువస్తాయి. ఇప్పుడు తెలంగాణకు మెడికల్‌ సీట్లు అనగానే చర్చ యాదికి వచ్చింది. ఇంతకు ముందు ఎన్నోసార్లు చర్చ అన్న లగడపాటికి పరాభవమే ఎదురైంది. కేసీఆర్‌తో చర్చిస్తాడట ! అప్పట్లో ఓ చానల్‌లో కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌తో చర్చకు వచ్చిన లగడపాటి ఓ చిన్నపాటి మౌనవ్రతంలో ఉన్నట్లు ‘అవును, కాదు’ అన్న మాటలు తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. కొడుకుతో మాట్లాడేటప్పుడే మాటలు రాని ఆయనకు తండ్రితో మాట్లాడే సత్తా ఉంటుందా ! మరో చానల్‌లో హరీశ్‌రావుతో చర్చకు రమ్మంటే వేదిక ఎక్కకుండానే వెనుక గేటు నుంచి పలాయనం చిత్తగించిన చరిత్ర లగడపాటిది. ఈ టీజీ, లగడపాటిలు ఏదో రకంగా తెలంగాణ అంశాన్ని చల్లబర్చడమే పనిగా పెట్టుకున్నారని సీమాంధ్రలోనూ ఏ బుడ్డోన్ని అడిగినా చెబుతారు. ఇక తెలంగాణలో వాళ్ల వ్యాఖ్యలు వస్తే ‘వీళ్లింతే’ అని నవ్వుకుంటున్నారు. కనీసం పట్టించుకునే దిక్కు కూడా లేదు. అయినా.. మనకు తెలియనివా టీజీ, లగడపాటి కథల చరితం..!