విపక్షాలపై అస్త్రంగా సీబీఐ
– అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ,డిసెంబర్18(జనంసాక్షి): బీజేపీ సర్కారు విపక్షాలపై దాడులు చేయడానికి సీబీఐని అస్త్రంగా వాడుకుంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ బిజెపిపై ఎదురుదాడిని ట్విట్టర్ వేదికగా కొనసాగిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆయన మరి కొన్ని ట్వీట్లతో మండిపడ్డారు. బిజెపికి ప్రతిపక్షాలుగా ఉన్న వాటన్నింటిపైనా సీబీఐ దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఓ సీబీఐ అధికారి తనతో చెప్పారని ట్వీట్ చేశారు. తమకు అడ్డుగా నిలుస్తున్న వారందరిపై సీబీఐని ప్రయోగించి దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దిల్లీ అండ్ డిస్టిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందులో తీవ్ర అవినీతి చోటుచేసుకుందని అందుకు బాధ్యత వహిస్తూ జైట్లీ రాజీనామా చెయ్యాలని గురువారం ఆప్ డిమాండ్ చేసింది. దిల్లీ సచివాలయంలో పనిచేస్తున్న రాజేంద్రకుమార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో సీబీఐ ఇటీవల ఆ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. దీంతో భాజపా, ఆప్‌ల మధ్య మళ్లీ చిచ్చు రేగి మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి, ఓ ఆంగ్ల పత్రిక ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేయడం సంచలనం రేపింది. శుక్రవారం సోషల్ విూడియాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ నేత వినీతా దేశ్‌ముఖ్ ట్వీట్‌కు స్పందించిన కేజీవ్రాల్.. అర్ణబ్ గోస్వామిపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రిని వెనకేసుకు రావడంలో అర్ణబ్ ఉద్దేశం ఏమిటో.. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని ట్వీట్ చేశారు. రాజ్దీప్ సర్దేశాయ్‌లా నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఎందుకు అరుపులు, పెడబొబ్బలు పెడతున్నారంటూ అర్ణబ్‌ను ఉద్దేశించి వినీత ట్వీట్ చేశారు. అర్ణబ్ గోస్వామి.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేజీవ్రాల్.. జైట్లీతో ఆయనకున్న రిలేషన్ ఎలాంటిదో వెల్లడించాలని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ డిస్టిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో భారీ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫైలు కోసమే ఢిల్లీ సచివాలయంలో సీబీఐ దాడులు చేసిందని కేజీవ్రాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ దాడుల పేరుతో ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విూద పరుష పదజాలంతో విమర్శలు చేసిన సీఎం వ్యక్తిత్వం ఎలాంటిదో దేశ ప్రజలంతా చూశారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే డీడీసీఏ మాజీ అధ్యక్షుడు జైట్లీ, ఢిల్లీ సీఎం మధ్య వివాదం రాజుకుంది.